: ఫైటర్ల మధ్య వివాదం.. సల్మాన్ 'మెంటల్' కు రూ. 25 కోట్ల నష్టం
దక్షిణాది, ఉత్తరాది ఫైటర్ల మధ్య వివాదం ముదరడంతో, ఆ ప్రభావం సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'మెంటల్'పై పడింది. 12 రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవడంతో ఆ చిత్రానికి రూ. 25 కోట్లు నష్టం వాటిల్లింది. ఇంతకీ వివాదానికి కారణం ఏమిటంటే.. దర్శకనిర్మాత సొహయిల్ ఖాన్ 'మెంటల్' సినిమా కోసం దక్షిణాదికి చెందిన అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆలిండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఈసీ) నిబంధనల ప్రకారం.. ఏదేని భాషలో సినిమా నిర్మితమవుతుంటే 70 శాతం స్థానిక ఫైటర్లు, 30 శాతం పరభాషా ఫైటర్లు ఉండాలి. అయితే, ఈ నిబంధనను దక్షిణాది ఫైటర్లు వ్యతిరేకిస్తున్నారు. 50 శాతం తమ ఫైటర్లే ఉండాలని వారు పట్టుబడుతున్నారు.
ఇలా ఫైటర్ల మధ్య వివాదం చెలరేగడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీనికితోడు, సౌత్ ఇండియా ఫైటర్ల సమాఖ్య (ఫెఫ్సీ) కూడా తన ఫైటర్ల డిమాండ్ ను సమర్థించింది. సగం మంది ఫైటర్లను దక్షిణాది వారి నుంచే తీసుకోవాలంటూ ఫెఫ్సీ.. నిర్మాతను ఒత్తిడి చేస్తోందని ఏఐఎఫ్ఈసీ అధ్యక్షుడు ధర్మేష్ తివారీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో దక్షిణాది ఫైటర్లను బహిష్కరించాలని మెంటల్ నిర్మాత, ఏఐఎఫ్ఈసీ నిర్ణయించాయని తెలుస్తోంది. ఇదిలావుంటే, దక్షిణాది ఫైటర్ల డిమాండ్లతో వేగలేమనుకున్నారో, ఏమోగానీ, పలువురు బాలీవుడ్ నిర్మాతలు తమ చిత్రాల నుంచి దక్షిణాది ఫైట్ మాస్టర్లను తొలగించి, స్థానిక స్టంట్ మాస్టర్లకు అవకాశం ఇస్తున్నారు.