: పాక్ టెర్రరిస్టు ఉదంతాన్ని ఆ దేశ పత్రికలు ఎలా కవర్ చేశాయంటే...!
బుధవారం నాడు బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై జరిగిన పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిని ఆ దేశ పత్రికలు ఎలా ప్రచురించాయో తెలుసా? ఈ ఘటనకు ఎంత మాత్రమూ ప్రాముఖ్యత ఇవ్వకుండా, అసలు దాడి చేసిన వారు తమవారు కాదు, ఇండియాలోని రెబల్స్ అంటున్నట్టు వార్తలు రాశాయి. పాకిస్థాన్ లో అత్యధికులు చదివే దినపత్రిక 'డాన్' 16వ పేజీలో ఈ వార్తకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రచురించింది. "ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు, ఒక మిలిటెంట్ మరణం: భారత పోలీసులు" అని హెడ్డింగ్ పెట్టిన ఆ పత్రిక, వార్తలో మాత్రం, ఓ మిలిటెంట్ పట్టుబడ్డాడు, దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. మరో ప్రముఖ పత్రిక 'ది న్యూస్ ఇంటర్నేషనల్' అసలీ వార్తను ప్రచురించనే లేదు. 'ది నేషన్' తన 12వ పేజీలో 'టూ ఇండియన్ ట్రూప్స్ కిల్డ్ ఇన్ ఐహెచ్ కే బాటిల్' అని రాసి సరిపెట్టింది. దాడులు జరిపిన వారు ఇండియాలోని రెబల్స్ వర్గానికి చెందినవారని అభిప్రాయపడింది. మరికొన్ని పత్రికలు వార్తను చిన్నదిగా రాసినప్పటికీ, ఇనస్పెక్టర్ జనరల్ దినేష్ రాణా మీడియా సమావేశం గురించి ప్రస్తావించ లేదు. కాగా, పాక్ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా అధికారికంగా స్పందించలేదు.