: అవినీతిని బయటపెట్టిన జర్నలిస్టుకు ఉత్తరాఖండ్ లో ఏం జరిగిందంటే...!
ఉత్తరాఖండ్ లో విలేకరిగా పనిచేస్తున్న అశోక్ పాండే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ప్రసిద్ధి చెందారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మహమ్మద్ షాహిద్ లిక్కర్ మాఫియాకు చెందిన కొంతమంది వ్యాపారులతో మద్యం లైసెన్సుల గురించి బేరసారాలు సాగించారు. ముందుగానే విషయం తెలుసుకున్న అశోక్ పాండే స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ ఈ తతంగాన్ని రికార్డు చేశారు. అంతేకాక సదరు భాగోతాన్ని బట్టబయలు చేశారు. ఇక ఆ తర్వాత అశోక్ పాండేకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా అన్నీ సవ్యంగానే ఉన్న అశోక్ పాండే ఇంటిని ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ముస్సోరి-డెహ్రాడూన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంఎండీఏ)కి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎంఎండీఏ మంగళవారం అశోక్ పాండే ఇంటిలోని కొంత భాగాన్ని కూల్చేసింది.