: తుపాకీ తీసి కాల్చితే సమస్యలు పరిష్కృతం కావు: అక్రమ్
పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కారుపై బుధవారం కరాచీలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి కారుపై కాల్పులు జరపగా, అక్రమ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ షాకింగ్ ఘటనపై నేషనల్ స్టేడియం వద్ద అక్రమ్ మీడియాతో మాట్లాడుతూ... తుపాకీ తీయడం, ఒకరిపై కాల్పులు జరపడం వంటి చర్యలతో సమస్యలు పరిష్కృతం కావని అన్నారు. అనంతరం, ఘటన గురించి వివరించారు. "నేను స్టేడియానికి వస్తుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. స్టేడియానికి బయలుదేరిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉంది. నేను మిడిల్ లేన్ లో వస్తున్నాను. ఇంతలో నా కారును మరో కారు వెనుక నుంచి స్వల్పంగా ఢీకొట్టింది. దాంతో, పక్క నుంచి వెళ్లాలంటూ ఆ కారు డ్రైవర్ కు హ్యాండ్ సిగ్నల్ ఇచ్చాను. కానీ, అతను నన్ను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. ఏదో రేసులో పాల్గొంటున్నట్టు వెంటాడాడు. దాంతో, కొంత ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాను. ఆ కారును ఛేజ్ చేసి ఆ డ్రైవర్ ను ప్రశ్నించాను. ఇంతలో ఆ కారు వెనుక సీట్లో ఉన్న వ్యక్తి వచ్చి తుపాకీ తీసి గురిపెట్టాడు. కార్లు రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ప్రజలు నన్ను గుర్తుపట్టారు. అప్పుడా వ్యక్తి తుపాకీ కిందకు దించి కారుపై కాల్పులు జరిపాడు" అని వివరించారు. అనంతరం ఆ కారు నెంబర్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశానని, దాంతో కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. "పోలీసులకు అన్ని వివరాలు తెలిపాను. ఆ వ్యక్తిని పట్టుకుంటారన్న నమ్మకం ఉంది. రోడ్డుపై ఆవేశకావేషాలు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణం. కానీ, ఇలా తుపాకీ తీసి కాల్పులు జరిపితే సమస్యలు సమసిపోవు" అని అక్రమ్ హితవు పలికారు.