: చట్టాన్ని అనువుగా మార్చేసుకున్న లష్కర్-ఎ-తోయిబా...పొంచి ఉన్న ముప్పు


పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా భారత్ లోని చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ ఉగ్రవాద సంస్థ నుంచి పెను ముప్పు పొంచి ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. భారత్ లో 18 ఏళ్ల లోపు వారిని బాల నేరస్తులుగా పరిగణిస్తారు. వారు చేసే నేరాలను కరుడుగట్టిన నేరగాళ్లు చేసేవాటితో సరిపోల్చరు. అలాగే నేరమయ జీవితం నుంచి మారేందుకు వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, ఇతర వ్యాపకాల్లో నిపుణులుగా తీర్చిదిద్దడం చేస్తారు. దీంతో ఈ వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకునే కుట్రకు లష్కర్-ఎ-తోయిబా తెరతీసింది. ఈ ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందే తీవ్రవాదులు పొరపాటున భారత్ బలగాలకు పట్టుబడితే తమ వయసు 16 ఏళ్లు అని చెప్పాలని బోధిస్తారట. అలా చెబితే భారత్ లో బాలనేరస్తులుగా పరిగణిస్తారని, అందుకే తొలుత తన వయసు 16 ఏళ్లు అని సైన్యానికి చెప్పానని జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో పట్టుబడిన ఉగ్రవాది నావెద్ అలియాస్ ఖాసిం ఖాన్ తెలిపాడు. తరువాత జరిగిన విచారణలో తన వయసు 20 సంవత్సరాలని తెలిపాడు. ఈ లెక్కన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు బాలలను ఎంచుకుని, వారితో దాడులు చేయించి, చట్టాల నుంచి సులువుగా తప్పించుకోవాలని భావిస్తున్నాయని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వాళ్లను నేరుగా రంగంలోకి దించితే వారిలో మానసిక పరిణతి తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా కమాండర్లు జారీ చేసిన ఆదేశాలు పాటిస్తారని ఉగ్రవాదుల ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్ లో బాల ఉగ్రవాదులను కూడా చూసే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News