: భలే మంచి చౌక బేరమూ... కేజీ చికెన్ 100 రూపాయలే!
కేజీ చికెన్ కేవలం వంద రూపాయలు అంటే నమ్ముతారా? అవును, నల్గొండ జిల్లా కోదాడలో ఇద్దరు బడా వ్యాపారుల మధ్య పోటీ అక్కడి వారికి చికెన్ ను సరసమైన ధరకు అందిస్తోంది. కోదాడలో దాదాపు 25 షాపుల్లో చికెన్ విక్రయిస్తారు. ఈ షాపులన్నింటికీ ఇద్దరు వ్యాపారులు కోళ్లను సరఫరా చేస్తారు. అలా సరఫరా చేసినందుకు కేజీకి కొంత కమిషన్ తీసుకుంటారు. వారి మధ్య వచ్చిన పోటీతో వారికి సంబంధించిన రిటైల్ దుకాణాల్లో చికెన్ ధరను తగ్గించి అమ్ముతున్నారు. దీంతో వారి షాపుల్లో చికెన్ కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇతరులు కూడా అదే ధరకు అమ్మాల్సిన అగత్యం ఏర్పడింది. కోదాడలో వారం క్రితం కేజీ చికెన్ ధర 140 రూపాయలు ఉండగా, ఇప్పుడది 100 రూపాయలకు దిగింది. భవిష్యత్ లో కేజీ చికెన్ 90 రూపాయలకే అందించి తమను దెబ్బకొట్టనున్నారని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ సంగతేమో కానీ, చికెన్ సరసమైన ధరకే అందుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.