: వారి సాహసానికి...ఘనమైన బహుమానం
విమానం గాల్లో ఉండగా...సీట్లపై పెట్రోల్ చల్లి, ఓ చెత్తో కత్తి, రెండో చెత్తో నిప్పు పట్టుకుని దానికి నిప్పు అంటిస్తానని ఎవరైనా బెదిరిస్తే ప్రయాణికులు ఏం చేస్తారు? తమకు ఇక అవే చివరి క్షణాలనుకుని భయంతో ఇష్టదైవాన్ని తలచుకుంటారు. కానీ ఓ ఇద్దరు ప్రయాణికులు అలా భావించలేదు. వివరాల్లోకి వెళ్తే...చైనాకు చెందిన షెంజెన్ ఎయిర్ లైన్స్ విమానం గాల్లో ఉండగా ఓ దుండగుడు రెండు సీట్లపై పెట్రోల్ చల్లాడు. పెట్రోల్ వాసన గమనించిన ఫ్లైట్ అటెండెంట్ సిబ్బందికి తెలుపగా, వారు అప్రమత్తమయ్యారు. సిబ్బంది రావడం గమనించిన దుండగుడు, దగ్గరకు వస్తే నిప్పంటించేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. అంతలోనే దుండగుడు నిప్పంటించాడు. రేగిన మంటలను కొంత మంది సిబ్బంది ఆర్పేయగా, మరి కొంతమంది అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అతను వారితో పోరాటానికి దిగడంతో ఇద్దరు ప్రయాణికులు కూడా సిబ్బందికి సహకరించి దుండగుడ్ని బంధించారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన 9 మంది సిబ్బంది ఒక్కొక్కరికి 2.55 కోట్ల రూపాయలను బహుమతిగా అందజేయాలని షెంజెన్ ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. అలాగే సిబ్బందికి సహకరించిన ప్రయాణికులిద్దరికీ చెరో 16 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయాలని నిర్ణయించింది. ఈ ఘటన చోటుచేసుకున్నప్పుడు విమానంలో మొత్తం వందమంది ప్రయాణికులు ఉన్నట్టు ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది.