: సమస్యలు తగ్గుతాయనుకుంటే...పెరిగాయి: వాపోయిన కేజ్రీవాల్
ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత సమస్యలు తగ్గుతాయని భావిస్తే...అసలు సమస్యలు అప్పుడే ప్రారంభమయ్యాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాపోయారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని సమస్యలొచ్చినా ఎన్నికల వరకే కదా అని భావించానని, విజయం సాధించిన తరువాత తన అంచనా తప్పయిందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రతీకార చర్యలు చేపడతాయని ఎన్నికల సందర్భంగా భావించానని, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రెట్టింపు ప్రతీకార చర్యలు చేపడుతున్నాయని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టినా ఢిల్లీని అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. నీతి, నిజాయతీని నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో విజయం సాధించామని, తమ పంథా మారదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.