: దీర్ఘకాలిక నొప్పులా!... ఇవి తీసుకుంటే మేలట!
దీర్ఘకాలిక నొప్పులు చాలా మందిని వేదనకు గురిచేస్తుంటాయి. సూదులు గుచ్చుతున్నట్టు ఉండే నొప్పి కారణంగా ఏ పనిలోనూ మనసు లగ్నం చేయలేం. ముఖ్యంగా, వీపు, మోకాలు, మెడ ఇలా ఏదో ఒక అవయవంలో నొప్పి ఉదయం నిద్ర లేచే వేళ ఎంతో బాధిస్తుంది. ఇలాంటి నొప్పులకు మూలకారణం తెలిస్తే కానీ చికిత్స సాధ్యం కాదు. అయితే, 10 ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇలాంటి వేధించే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. తృణ ధాన్యాలు, ఆకు కూరలు, అల్లం, పసుపు, స్ట్రాబెర్రీలు, ఆలివ్ నూనె, నట్స్, పాల ఉత్పత్తులు, వైన్, సాల్మన్-మాక్రెల్ చేపలు తీసుకోవడం ద్వారా ఎంతకూ లొంగని నొప్పులతో పోరాడవచ్చని తెలిపారు. తృణ ధాన్యాల్లోని మెగ్నీషియం కండరాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇబూప్రొఫెన్ తరహాలోనే అల్లం కూడా పెయిన్ రిలీవర్ గా పనిచేస్తుంది. అల్లంలో జింజెరాన్, షోగావోల్స్, జింజెరోల్స్, పారడోల్స్ ఉంటాయి. ఇవి నొప్పి నివారణకు తోడ్పడతాయి. ఇక, పసుపులో ఉండే కర్కుమిన్ నొప్పిని తగ్గిస్తుంది. లిక్విడ్ గోల్డ్ గా పరిగణించే ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీఆక్సిడాంట్ పాలీఫెనోల్స్ సాధారణ నొప్పుల విషయంలో విశేషంగా పనిచేస్తుంది. ఇక, సాల్మన్ చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి కూడా నొప్పులతో ఢీకొట్టేవే. మాక్రెల్ లోనూ ఒమేగా-3 ఆమ్లాలు ఉంటాయి. అయితే, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారికి మాక్రెల్ లో లభించే ఒమేగా ప్యాటీ యాసిడ్లు క్షేమకరం కాదు. అలాంటి వారు సాల్మన్ చేపలను స్వీకరించడం మేలు. బాదంపప్పులు, ఆక్రోట్లు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడాంట్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీల విషయానికొస్తే... విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో ఇది కూడా కీలకమేనట. ఆకు కూరల గురించి చెప్పేదేముంది. విటమిన్ కె కలిగి ఉండే బచ్చలి, మెంతి కూర తీసుకుంటే ఎముకల పుష్టిగా ఉండడమే కాదు, జాయింట్లు కూడా దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. పాల ఉత్పత్తులైన యోగర్ట్, చీజ్ లో కాల్షియమ్, విటమిన్ డికి లోటు లేదు. ఇవి ఎముకల ఎదుగుదలకు విశేషంగా తోడ్పడతాయి. నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలోనూ ఇవి ఉపకరిస్తాయని తాజా పరిశోధనల్లో తేలింది.