: నా సోదరుడు బాంబుపేలుళ్లలో చనిపోయినా... అతను రాసిన ఉత్తరం మాత్రం భద్రంగా ఉంది: ఉద్వేగభరితుడైన గవర్నర్
మాస్కోలో ఉన్న తన సోదరుడు 1981లో తనకు ఒక ఉత్తరం రాశాడని... దురదృష్టవశాత్తు ఆయన బాంబు పేలుళ్లలో చనిపోయినప్పటికీ, ఆయన రాసిన ఉత్తరం మాత్రం తన దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఈ విషయం చెబుతున్నప్పుడు ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. 'డాక్ సేవా' పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. పోస్టు కార్డు, ఉత్తరాలు మనుషుల మధ్య ప్రేమ, అనుబంధాలను పెంచితే... ఇప్పుడున్న సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని అన్నారు. ఉత్తరాల్లో అవతలి వ్యక్తి ఆప్యాయత తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతమున్న మాధ్యమాల వల్ల అర్థంకాని భాషలో సమాచారం వేగంగా అందుతున్నప్పటికీ... ఉత్తరాల్లో ఉన్న ప్రేమ అందులో ఉండదని అన్నారు. ఉత్తరాలు చదువుతుంటే, మనసు తేలికవుతుందని... ఒక్కోసారి కళ్లు కూడా చెమ్మగిల్లుతాయని చెప్పారు. సెల్ ఫోన్ ద్వారా క్షణాల్లో డబ్బును బదిలీ చేయగలిగినప్పటికీ... మనీఆర్డర్ ద్వారా అయితే డబ్బుతో పాటు, నాలుగు మాటలు కూడా వస్తాయని... అవి చదివినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుందని అన్నారు. అలాంటి మనియార్డర్, టెలిగ్రాం సేవలను తపాలా శాఖ రద్దు చేయడం బాధగా ఉందని... ఆ సేవలను పునరుద్ధరించి, ప్రజలకు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని తపాలాశాఖకు సూచించారు.