: 'శంకరాభరణం' సినిమాకు చాగంటి వారి ప్రవచనం
తెలుగు సినిమా చరిత్రలో 'శంకరాభరణం' ఓ అపురూప కళాఖండం. ఎప్పుడు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది. అటువంటి చిత్రానికి కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచన రూపంలో విశ్లేషణ చేయనున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ లోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో సాయంత్రం 6 గంటల నుంచి విశ్లేషణ చెప్పనున్నారు. ఫ్రిబవరి 4, 1980లో విడుదలైన ఈ చిత్రానికి ఈ ఏడాదికి 36 ఏళ్లు. దానిని దృష్టిలో ఉంచుకుని 'మూడు పుష్కరాల (36 ఏళ్ల) సామ గాన సౌరభం-శంకరాభరణం' శీర్షికన ఈ కార్యక్రమం జరగనుందని చిత్ర దర్శకులు కె.విశ్వనాథ్, కార్యక్రమ నిర్వాహకులైన శ్రీనివాస్, శ్రీధర్ లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ, సుందరకాండ, రామాయణ, మహాభారతాల లాగా గురుశిష్య సంబంధమైన 'శంకరాభరణం' గురించి ఒక సప్తాహం చేయగలనని పదేళ్ల కిందట చాగంటి తనకు చెప్పారని తెలిపారు. అప్పటి మాటను ఆయన ఇప్పుడు నిజం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రవచన రూప విశ్లేషణ ఈ సినిమాకు అచ్చమైన కావ్య గౌరవాన్ని ప్రసాదిస్తుందని విశ్వనాథ్ పేర్కొన్నారు. 'సాగరసంగమం', 'స్వర్ణకమలం' వంటి ఇతర సినీకావ్యాలకు కూడా సమగ్ర విశ్లేషణ జరిగితే మరింత మందికి వాటిలోని అంతరార్థాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే ఓ సినిమాకు చాగంటి ప్రవచన విశ్లేషణ ఇవ్వడం ఇదే తొలిసారి.