: కసబ్ తర్వాత సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది... పేరు ఉస్మాన్!
భారత భద్రతాబలగాలు మరో విజయాన్ని సాధించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఈ ఉదయం జమ్మూకాశ్మీర్ లోని ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించగా, ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది సమీపంలో ఉన్న గ్రామంలోకి పారిపోయి, ముగ్గురు స్థానికులను బంధించి అడవిలోకి తీసుకెళ్లాడు. అనంతరం, నాలుగు గంటల పాటు సదరు ఉగ్రవాదికి, బీఎస్ఎఫ్ కు ఎదురు కాల్పులు జరిగాయి. ఆ తర్వాత, ఉగ్రవాది చెరలో ఉన్న ముగ్గురు స్థానికుల సహకారంతో ఆ ముష్కరుడిని బీఎస్ఎఫ్ జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. అనంతరం, సదరు ఉగ్రవాదిని తాళ్లతో బంధించి భారీ సెక్యూరిటీ మధ్య ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం అతన్ని విచారించనున్నారు. బీఎస్ఎఫ్ బలగాలు సజీవంగా పట్టుకున్న ఉగ్రవాది పేరు ఉస్మాన్. వయస్సు 20 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందినవాడు. ముంబైపై దాడి సందర్భంలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది కసబ్ ను పట్టుకున్న తర్వాత... భారత బలగాలు మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. మొన్న పంజాబ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో, ఒక్క ముష్కరుడినైనా సజీవంగా పట్టుకోవాలని మన బలగాలు విశ్వప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించలేదు. ఆ ఆపరేషన్ లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. అయితే, కొద్ది రోజులు కూడా తిరక్కముందే మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడటం మన బలగాలు సాధించిన గొప్ప విజయం. ప్రస్తుతం పట్టుబడ్డ ఖాసిం ఖాన్ ను విచారిస్తే, అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. దీంతో, దుష్ట పాకిస్థాన్ అసలు స్వరూపాన్ని యావత్ ప్రపంచానికి మరోసారి చూపించే అవకాశం భారత్ కు వస్తుంది.