: ఫ్రెషర్స్ వద్దంటున్న ఐటీ దిగ్గజాలు, అనుభవానికే రెడ్ కార్పెట్!
స్టార్టప్ కంపెనీలు దూసుకువస్తుంటే, వాటి నుంచి వస్తున్న పోటీని తట్టుకుని కొత్త ఆలోచనలతో ముందడుగు వేసేందుకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అనుభవజ్ఞులకు పెద్ద పీట వేస్తున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా యువతను ఆకర్షణీయమైన వేతనాలు ఇచ్చి తీసుకునే బదులు, అనుభవమున్న వారిని విధుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నాయి. సుమారు 146 బిలియన్ డాలర్లకు (రూ. 9.3 లక్షల కోట్లు) చేరిన భారత ఐటీ ఇండస్ట్రీలో ఐదేళ్ల నాటి సరాసరి ఉద్యోగుల వయసుతో పోలిస్తే, ఇప్పుడు వయసు ఎక్కువగా ఉంది. నాస్కామ్ అంచనాల ప్రకారం 2010లో 27 సంవత్సరాలుగా ఉన్న సరాసరి వయసు ఇప్పుడు 28 సంవత్సరాలకు చేరింది. ఇక కంపెనీల వారీగా పరిశీలిస్తే, ఇన్ఫోసిస్ లో 26 గా ఉన్న ఉద్యోగి సరాసరి వయసు 29 సంవత్సరాలకు, విప్రోలో 29 ఏళ్ల నుంచి 30.3 ఏళ్లకు, హెచ్ సీఎల్ టెక్ లో 28 నుంచి 31 వరకూ పెరిగింది. ఐటీ కంపెనీల్లో సరాసరి వయసు ఐదేళ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు వేగంతో పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. కాగా, ఫ్రెషర్స్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలతో పోలిస్తే స్టార్టప్ కంపెనీల్లో చేరేందుకే ఉత్సాహం చూపుతున్నారని నాస్కామ్ వ్యాఖ్యానించింది. ఐటీ దిగ్గజాలు వీరిని విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరిస్తుండటమే ఇందుకు కారణమని తెలిపింది.