: అమ్మకానికి యువతులు... ధరల వివరాలతో ఐఎస్ఐఎస్ పాంప్లెట్లు!
ఇస్లామిక్ తీవ్రవాదుల అంతులేని దురాగతాలకు ఇది మరో ఉదాహరణ. తాము అపహరించిన బాలికలను, యువతులను లైంగిక బానిసలుగా కొనుక్కుపోవాలని ఉగ్రవాదులు పాంప్లెట్లు పంచుతున్నారు. ఒక్కొక్కరి ధరను నిర్ణయిస్తూ, ముద్రించిన కాగితాలు పంచుతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి జైనబ్ బంగురా వెల్లడించినట్టు 'బ్లూమ్ బర్గ్' తెలిపింది. ఒక సంవత్సరం వయసున్న చిన్నారులు అత్యధిక రేటు పలుకుతుండగా, 20 సంవత్సరాలు దాటిన అమ్మాయిల రేటు తక్కువగా ఉందని ఆయన తెలిపారు. 1 నుంచి 9 సంవత్సరాల్లోపు బాలబాలికలను 165 డాలర్లకు విక్రయిస్తున్నారని, కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు 124 డాలర్ల వెల నిర్ణయించారని ఆయన వివరించారు. వీరిని వరుసగా నిలబెట్టి విక్రయాలు జరుపుతున్నారని, ఐదారుగురు ఐఎస్ఐఎస్ ఫైటర్లు కలసి ఒకరిని కొంటున్నారని తెలిపారు. కొన్ని సార్లు బానిసలను వారి సొంత కుటుంబాలకు అప్పగించేందుకు వేలాది డాలర్లు తీసుకుంటున్న ఘటనలూ చోటు చేసుకున్నాయని ఆమె పేర్కొన్నారు. వీరిని బానిసలుగా కొనుగోలు చేసేందుకు మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ధనవంతులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అమ్మాయిల్లో అత్యధికులు యాజిడి వర్గానికి చెందిన వారని, వారి శరీర సౌష్టవం, కళ్ల రంగు, కురుల పొడవు తదితరాలు ధరల నిర్ణయంలో కీలకమని అన్నారు.