: ఎంపీ కవిత వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయి: వెంకయ్య
హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు మరోసారి స్పష్టత ఇచ్చారు. హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తామని ఉద్ఘాటించారు. అయితే కోర్టు విభజనను అడ్డుకుంటూ చంద్రబాబు తెలంగాణపై అజమాయిషీ చలాయిస్తున్నారని, విభజనకు కేంద్రం సహకరించడం లేదన్న ఎంపీ కవిత మాటలపైనా వెంకయ్య మాట్లాడారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దని సూచించారు. తమది ప్రాంతీయ పార్టీ కాదని, జాతీయ పార్టీ అని వివరించారు. కవిత వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయన్నారు. కోర్టు విభజన అంశాన్ని రాజకీయం చేయొద్దని టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. విభజన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని వెంకయ్య పేర్కొన్నారు. ఆ వెంటనే టీడీపీ ఎంపీ మల్యాద్రి మాట్లాడుతూ, సభలో లేని తమ నేత (చంద్రబాబు) గురించి కవిత ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.