: స్పీకర్ పై ఎంతో గౌరవం ఉంది... ఆమె నిర్ణయాలే నచ్చడం లేదు: రాహుల్ గాంధీ
తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా, పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు జేడీయూ, ఆర్జేడీ, వామపక్షాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, స్పీకర్ సుమిత్ర మహాజన్ పై తమకు ఎంతో గౌరవం ఉందని... అయితే, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రం తాము ఆమోదించలేమని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ, ఎంపీ ల సస్పెన్షన్ పై తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేతపై తమకు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ను ఈరోజు ఎత్తివేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.