: సబ్సిడీ ఉల్లిపై తెలుగు రాష్ట్రాల నిబంధనలు ఒక్కటే... క్వాంటిటీలోనే తేడా!
తెలుగు ప్రజలకు ఉల్లి ‘ఘాటు’ తగ్గించేందుకు తొలుత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ... రెండు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కిలో రూ.20 పలికిన ఉల్లి ధర, ఒక్కసారిగా రూ.50 తాకడంతో తెలుగు ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే వెనువెంటనే మేల్కొన్న ఏపీ సర్కారు సబ్సీడీ కింద రూ.20కే కిలో ఉల్లి సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఏపీలోని మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు కార్డులతో వచ్చే వినియోగదారులకు ఒక్కొక్కరికి కిలో చొప్పున పంపిణీ చేసింది. తాజాగా తెలంగాణ కూడా రూ.20కే కిలో సబ్సిడీ ఉల్లి సరఫరాను నిన్న మొదలెట్టింది. తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉల్లి సరఫరాను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులు గుర్తింపు కార్డులతో కౌంటర్లకు రావాలని పేర్కొన్నారు. అంటే రెండు రాష్ట్రాల సబ్సిడీ ఉల్లి సరఫరాకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అన్నమాట. అయితే ఏపీ ఒకరికి కిలో మాత్రమే ఇస్తుంటే, తెలంగాణ మాత్రం ఒక్కొక్కరికి రెండు కిలోలు అందజేస్తోంది.