: కల్వర్టు కింద మట్టి కొట్టుకుపోయింది... దుర్ఘటనకు అదే కారణమన్న రైల్వే సీపీఆర్వో
మధ్యప్రదేశ్ లోని హర్దా సమీపంలో నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాదిని ముంచెత్తిన భారీ వర్షం నేపథ్యంలో పోటెత్తిన వరద నీరే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అయితే తొలుత వంతెనపై ప్రమాదం జరిగిందని ఆ శాఖ అనుమానం వ్యక్తం చేసినా, ఆ తర్వాత ఆ వాదన సరికాదని చెప్పింది. ఈ మేరకు రైల్వే శాఖ సీపీఆర్వో అనిల్ కొద్దిసేపటి క్రితం ప్రమాదం జరిగిన వైనాన్ని మీడియాకు వివరించారు. మాచక్ నదిపై ఉన్న వంతెనకు ముందు ఓ కల్వర్టు ఉంది. భారీ వరద నీరు కారణంగా సదరు కల్వర్టు కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. ఇదే సమయంలో ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ కల్వర్టు వద్దే ప్రమాదానికి గురికాగా, రైలు ఇంజిన్ తో పాటు ఆరు బోగీలు నదిలో పడిపోయాయి. ఇక ఆ మార్గంలో కామయాని ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా జబల్ పూర్ నుంచి ముంబై వస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ ఇంజిన్, నాలుగు బోగీలు అప్పటికే పాడైన వంతెనపై నుంచి నదిలో పడిపోయాయి.