: మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం... మాచక్ నదిలో పడ్డ 15 బోగీలు, భారీగా ప్రాణనష్టం


మధ్యప్రదేశ్ లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన 15 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది మీదుగా వంతెనపై వెళుతున్న క్రమంలో ఉన్నట్టుండి వంతెన కూలడంతో తొలుత రాత్రి 11.30 గంటలకు కామయాని ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు నదిలో పడిపోయాయి. ఆ తర్వాత 11.45 గంటలకు అదే మార్గం మీదుగా వచ్చిన జనతా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 5 బోగీలు నదిలో పడిపోయాయి. హర్దాకు 25 కిలో మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటిదాకా వెల్లడికాలేదు. భారీ సంఖ్యలో ప్రయాణికులు మరణించి ఉంటారని సమాచారం. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దాదాపు 300 మంది ప్రయాణికులను కాపాడారు. భారీ వర్షాల నేపథ్యంలో మాచక్ నదికి వరద నీరు పోటెత్తడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ప్రస్తుతం అక్కడ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News