: ప్రత్యూష తండ్రి, సవతి తల్లికి బెయిల్ నిరాకరణ
అయినవాళ్లు ఉన్నా అనాథలా మారిన ప్రత్యూష దయనీయ గాథ తెలిసిందే. ఆమెను చిత్రహింసలకు గురిచేసిన తండ్రి రమేశ్, సవతి తల్లి చాముండేశ్వరిలకు తాజాగా రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. కన్నతండ్రి పట్టించుకోకపోగా, సవతి తల్లి చిత్రహింసల పాల్జేయడంతో తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రత్యూష కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుంది. ప్రత్యూష విషాద గాథపై స్పందించిన హైకోర్టు ఆ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో ఆమెపై అందరికీ సానుభూతి వెల్లువెత్తింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కూడా ఆ బాలిక దీనస్థితి కదిలించింది. దాంతో, ఆయన ప్రత్యూష బాధ్యతలను తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. కోర్టు కూడా కేసీఆర్ ను అభినందించింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూష నేరుగా కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లింది. అక్కడ కేసీఆర్ ఆమెతో కలిసి భోజనం చేసి ఆత్మీయ వచనాలు పలికారు. అనంతరం, నర్సింగ్ విద్య నిమిత్తం ఆమెను కీసరలోని మహిళా వసతి గృహానికి తరలించారు.