: అక్కడి మహిళలు మగపిల్లలే కావాలని కోరుకుంటున్నారు!
'భేటీ బచావ్, భేటీ పడావ్' అంటూ కేంద్రం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయినాసరే భ్రూణహత్యల హర్యాణాలో ఏమాత్రం మార్పురావడం లేదు. సాక్షాత్తూ అక్కడి తల్లులే తమకు 'అమ్మాయి వద్దు అబ్బాయే ముద్దు' అని భావిస్తున్నారు. హర్యాణాలో కురుక్షేత్ర, సోనీపేట జిల్లాల్లో జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికి గురి చేసే వాస్తవం వెల్లడైంది. ఈ జిల్లాల్లో 65 శాతం మంది మహిళలు తమకు అబ్బాయే పుట్టాలని కోరుకుంటున్నారు. సుమారు వెయ్యి మందిపై జరిపిన సర్వేలో అత్యధికులు అబ్బాయి పుడితే సమాజంలో గౌరవం పెరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా వయసుడిగిన తరువాత తమను పోషిస్తాడని భావిస్తున్నారు. అందుకే అబ్బాయి పుట్టాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. కాగా, హర్యాణాలో భ్రూణహత్యల కారణంగా అవివాహిత పురుషుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు నియోజకవర్గాల యువకులు తమకు వివాహం జరిపిస్తామని ఎవరు హామీ ఇస్తే వారికే ఓటేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.