: భిక్షగాళ్లతో 'స్వచ్ఛ భారత్', 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారం
అబ్బ! ఇంతవరకు ఎవ్వరికీ రాని ఐడియా ఒకటి నరేంద్ర మోదీ సర్కార్ కి వచ్చింది. తమ ప్రభుత్వ పథకాల ప్రచారానికి బిచ్చగాళ్లను ఎంచుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'స్వచ్ఛ భారత్ అభియాన్', 'బేటీ బచావో, బేటీ పడావో' కార్యక్రమాలకు దేశవ్యాప్త ప్రచారం కల్పించబోతోంది. ఇందుకు ప్రభుత్వం వినూత్న ప్రచార పంథా ఎంచుకుంది. ఈ రెండు కార్యక్రమాలకు రైళ్లలో పాటలు పాడుతూ తిరిగే భిక్షగాళ్లతో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం 3000ల మంది పురుషులు, మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో 'తుమ్ తో తెహ్రా పరదేశి' అనే జింగిల్ తో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంపై పట్టణ, గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. దాంతో అటు యాచకులకు పని కల్పించడంతో బాటు, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కూడా వచ్చినట్లు ఉంటుందన్న సదుద్దేశంతోనే ఇలా చేయాలని సర్కార్ తలచింది. త్వరలోనే ముంబై సబర్బన్ రైలు సర్వీసుల్లో ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. తరువాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం మొదలు పెట్టనున్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది.