: ఆఫీసుల్లో కోపం, ఆవేశం కలుగుతోందా? ఇలా అదుపు చేసుకుంటే విజయం మీదే!


ప్రతి ఒక్కరికీ కోపతాపాలు సహజం. ఏదో ఒక సమయంలో తెలియకుండానే ఉద్వేగ పడటం, పక్కవారిపై కేకలేయడం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేస్తున్న సమయంలో వివిధ కారణాలతో కొన్నిసార్లు కోపం వస్తుంది. ఆ సమయంలో భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోతే, ఉన్నతాధికారుల దృష్టిలో చెడు అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ కోపం, ఆవేశాలను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు కొన్ని మార్గాలు...

పనిపై ఏకాగ్రత:

ఇంటి విషయాలను ఇంట్లోనే వదిలివేయాలి. ఆఫీసుకు వచ్చిన తరువాత చేస్తున్న పనిపైనే దృష్టిని నిలిపితే, సగం భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. సమయం, సందర్భాన్ని బట్టి స్పందించాలి. మదిలోకి వేరే ఆలోచనలు, ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకురాకుండా ఉండాలి.

ఆఫీసులోనే సమస్య ఉన్నట్లయితే..:

కార్యాలయాల్లో కోపతాపాలకు ఇదే ప్రధాన కారణం. సహోద్యోగుల్లో నచ్చని గుణాలున్న వారుంటే, సాధ్యమైనంత వరకూ వారిని గురించి మరచిపోవాలి. వ్యక్తుల కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని మాత్రమే గుర్తెరగాలి. ఎదుటివారిలో నచ్చని గుణాలపై వారితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. దీనివల్ల ఆవేశాలను అదుపు చేసుకోవచ్చు.

కాసేపు రిలాక్స్ కావాలి:

ఏదైనా కోపం కలిగే సంఘటనలు జరిగితే వెంటనే ఓ ఐదు లేదా పది నిమిషాలు సీట్లోంచి లేచి బయటకు వెళ్లాలి. అలా కుదరని పక్షంలో మీకు నచ్చిన సన్నివేశాలను మది నుంచి వెలికితీసి ఆ భావనల్లో కాసేపు ఆహ్లాదంగా గడిపి రండి. జీవితంలో మీ విజయాలను గుర్తు చేసుకోండి. దీని వల్ల ఉద్వేగం వెంటనే తగ్గుతుంది.

తక్కువగా మాట్లాడాలి:

తప్పనిసరి పరిస్థితుల్లో కోపం వచ్చి, దాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఎదురైతే, సాధ్యమైనంత తక్కువ మాటల్లో చెప్పేయాలి. కోపంతో పెద్దగా అరిస్తే, అది మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది. చెప్పాల్సింది సూటిగా, నిక్కచ్చిగా చెప్పి, ఎదుటివారు ఏ తప్పు చేసినందుకు కోపం వచ్చిందన్న విషయాన్ని వెల్లడించాలి. ఇలా ఎవరికి వారు తమను అదుపు చేసుకుంటే, జీవితంలో విజయం సాధించిన వారిగా నిలవొచ్చు.

  • Loading...

More Telugu News