: ఐఎస్ చెర వీడని తెలుగోళ్లు... శంషాబాదు చేరుకున్న కన్నడిగులు
లిబియాలో ఐఎస్ ఉగ్రవాదుల చెరకు చిక్కిన తెలుగు ప్రొఫెసర్లకు ఇంకా ఉపశమనం లభించలేదు. ఆరు రోజుల క్రితం హైదరాబాదుకు చెందిన బలరాం, గోపీకృష్ణ సహా కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల పాటు తమ వద్ద ఉంచుకున్న కన్నడ ప్రొఫెసర్లు విజయ్ కుమార్, లక్ష్మీకాంత్ లను ఉగ్రవాదులు వదిలిపెట్టారు. మూడు రోజుల క్రితం ఐఎస్ చెర వీడిన వీరిద్దరూ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. మరికాసేపట్లో వారు అక్కడి నుంచి తమ సొంత రాష్ట్రం కర్ణాటకకు బయలుదేరనున్నారు. ఇదిలా ఉంటే, వీరిద్దరితో పాటే ఐఎస్ చెరకు చిక్కిన తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలు ఇంకా ఐఎస్ చెరలోనే ఉన్నారు. ఆరు రోజులుగా ఉగ్రవాదుల చెరలో ఉన్న వీరిద్దరూ ఎలా ఉన్నారోనన్న ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో అంతకంతకూ పెరుగుతోంది.