: మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పై స్థానికుల దాడి... ఐదుగురు ఖాకీలకు గాయాలు
సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పై నిన్న రాత్రి స్థానికులు ముప్పేట దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ కు చెందిన బన్నప్ప అనే వ్యక్తి పోలీసు ఠాణాలో చనిపోయిన వైనంపై ఆగ్రహావేశాలతో ఊగిపోయిన అతడి బంధువులు, కాలనీ వాసులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోని వాహనాలకు కూడా కాలనీ వాసులు నిప్పు పెట్టారు. దీంతో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న రాత్రి బోనాల సందర్భంగా కాలనీకి చెందిన బన్నప్ప (35), ఓ హోంగార్డు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బన్నప్పను పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో అతడు అక్కడే అపస్మారక స్థితిలోకి చేరాడు. అయితే అతడి కోసం పీఎస్ కు వచ్చిన బంధువులు అతడిని ఆ స్థితిలోనే ఇంటికి తీసుకెళ్లారు. ఎంతకీ అతడు లేవకపోవడంతో అనుమానం వచ్చిన బన్నప్ప బావమరిది పోలీసులను నిలదీశాడు. అతిగా మద్యం సేవించిన కారణంగానే బన్నప్ప ఆ స్థితికి చేరాడని చెప్పిన పోలీసులు, అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించమని ఉచిత సలహా పడేశారు. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే బన్నప్ప పోలీస్ స్టేషన్ సమీపంలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.