: ఇది కుంభకర్ణుల పని పట్టే మంచం!
నిద్రను అత్యంత ప్రేమించే కుంభకర్ణుడికి, ఈ మంచానికి అస్సలు పడదు. అదేంటి, కుంభకర్ణుడు ఇప్పుడెక్కడున్నాడు అనుకుంటున్నారా? కుంభకర్ణుడు లేకున్నా ఆయన అంశను అందిపుచ్చుకున్నవారు కోకొల్లలు. కొంత మందిని రోజల్లా పడుకోమన్నా హాయిగా నిద్రపోతారు. మరి కొంత మందికి ఆఫీస్ లేదా కాలేజికి టైమైపోతున్నా మంచం మీదనుంచి లేవడం ఇష్టం ఉండదు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కోలిన్ ఫ్రూజ్ అనే బ్రిటన్ ఇంజనీరు ఓ మంచాన్ని కనిపెట్టాడు. ఈ మంచానికి మనం లేవాల్సిన టైమ్ సెట్ చేసి పడుకుంటే చాలు మనల్ని అలారం మోతతో ఎంచక్కా లేపేస్తుంది. అయినా లేవని పక్షంలో ఎత్తికుదేస్తుంది. దీంతో మంచంపై నుంచి కిందపడ్డాక ఎవరైనా లేవాల్సిందే. ఇందుకోసం న్యుమాటిక్ యూనిట్ ను వాడాడీ ఇంజనీరు. మంచం కింద ఓ మోటారు, రెండు న్యుమాటిక్ సిలెండర్లు అమర్చాడు. అలారాన్ని అంబులెన్స్, కారు హారన్ వంటి వాయిద్యాల శబ్దాలతో జత చేశాడు. అలారం మోగగానే ఆ హోరుకు లేవాల్సిందే. ఒకవేళ మంచంపై బరువు (నిద్రపోతున్న వ్యక్తి) అలాగే ఉన్న పక్షంలో న్యుమాటిక్ సిలెండర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. అవి పైకిలేచి మంచంపై ఉన్న వ్యక్తిని అమాంతం ఎత్తిపడేస్తాయి. దీంతో ఎంత నిద్రమత్తులో ఉన్నా, కిందపడగానే లేచి కూర్చుంటారు. అయితే ఈ మంచానికి మరికొన్ని సర్దుబాట్లు ఉన్నాయని అవి పూర్తికాగానే మార్కెట్ లో పెడతానని ఆయన చెబుతున్నాడు.