: 2014లో 82 శాతం పెరిగిన అవినీతి ఫిర్యాదులు... ఎక్కువ సంఖ్యలో రైల్వే ఉద్యోగులపైనే!
మునుపెన్నడూ లేని విధంగా దేశంలో అవినీతి ఫిర్యాదులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతేడాది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు 64వేలకు పైగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు ఏడాదికంటే ఫిర్యాదుల సంఖ్య 82 శాతం పెరిగిందని పేర్కొంది. మొత్తం 64,410 ఫిర్యాదులు వచ్చాయని సీవీసీ తెలిపింది. ఫిర్యాదుల సంఖ్య పెరిగినప్పటికీ తమ సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదని ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన 2014 వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇక 2013లో 35,332 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇంత భారీ సంఖ్యలో కమిషన్ కు అవినీతి ఫిర్యాదులు రావడం ఇదే తొలిసారని సీవీసీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే గతేడాది వచ్చిన ఫిర్యాదుల్లో ప్రభుత్వ సంస్థ రైల్వే పైనే గరిష్ఠ సంఖ్యలో 12వేలకు పైగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. బ్యాంక్ అధికారులపై 6,836, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులపై 3,572, ఆదాయపన్ను అధికారులపై 3,468 ఫిర్యాదులు 2014లో వచ్చినట్టు సీవీసీ తన నివేదికలో తెలిపింది.