: ఇష్టానికి మాట్లాడితే ప్యాకేజీలు కాదు, ఉద్యమాలు వస్తాయి: టీజీ
ప్రత్యేక హోదాపై ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు మాట్లాడితే, వచ్చే ప్యాకేజీలు కూడా ఆగిపోతాయని, ఆపై కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తాయని మాజీ మంత్రి, రాయలసీమ నేత టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆంధ్రాతో పాటు రాయలసీమ అభివృద్ధి చెందకుంటే ప్రజలు పోరుబాటలో నడుస్తారని అన్నారు. కర్నూలును రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలని టీజీ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు ప్యాకేజీలపై నోరు మెదపడం లేదని విమర్శించారు. విభజన సమయంలో చివరి కోరికగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, హోదా గురించి మాట్లాడుతూ, అభివృద్ధి పనులను దూరం పెట్టరాదని హితవు పలికారు.