: హైదరాబాద్ ఐటి కారిడార్ లో 'టెర్రర్ అలర్ట్'
దేశంలో ఇటీవల జరిగిన ఉగ్ర ఉదంతాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాదులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కారిడార్ లో సైబరాబాద్ పోలీసులు 'టెర్రర్ అలర్ట్' ప్రకటించారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీల సెక్యూరిటీ గార్డులకు తుపాకులు తదితర ఆయుధాలను ఇవ్వాలని నిర్ణయించినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. "ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సెక్యూరిటీ గార్డుల చేతుల్లో ఆయుధాలుంటే మంచిదని భావిస్తున్నాం. ఏవైనా దాడులు జరిగితే పోలీసులు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్పందించేందుకు వీలుంటుంది. అలా కాకుంటే సెక్యూరిటీ గార్డులు చూస్తూ ఊరకుండాల్సి వుంటుంది. ఆయుధాలు ఇచ్చే ముందు వాటిని ఎలా వాడాలన్న విషయం గురించి తెలియజెప్పేందుకు సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇస్తాం" అని ఆయన అన్నారు. మాదాపూర్, గచ్చిబౌలీ పరిసరాల్లో 500 వరకూ రిజిస్టర్డ్ ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిల్లో పనిచేస్తున్న గార్డుల్లో ఇద్దరిని ఎంపిక చేసి ఒక బేసిక్ వెపన్ (పిస్టల్ వంటిది), మరో అడ్వాన్డ్స్ వెపన్ ఇస్తామని ఆయన అన్నారు.