: బీడీ ఇవ్వలేదని చేయి నరికేశాడు!
బీడి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తోటి వ్యక్తిపై కత్తితో దాడి చేసి, ఏకంగా అతని చేయినే నరికిపారేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా అగిరిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే అవుటుపల్లి జోగి (30) ఈ ఉదయం పనికి వెళ్లడానికి సెంటర్ కు వచ్చాడు. అనంతరం, అక్కడే ఉన్న ముసలయ్య (50)ని బీడీ అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన జోగి తన చేతిలో ఉన్న కర్ర కత్తితో దాడి చేశాడు. దీంతో, కత్తి వేటును తప్పించుకోవడానికి ముసలయ్య తన చేతిని అడ్డు పెట్టాడు. అయితే, కర్ర కత్తిని జోగి బలంగా విసరడంతో ముసలయ్య చేయి తెగి పడిపోయింది. జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన జోగి అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు జోగి ఇంటికి వెళ్లి అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పజెప్పారు.