: ఉస్మానియా ఆసుపత్రి మొత్తాన్ని తరలించడం లేదు... అది కేవలం అపోహే: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్ లోని ఉస్మానియా తరలింపుపై పలువురి నుంచి వస్తున్న విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఆసుపత్రి మొత్తాన్ని తరలించడం లేదని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పాత భవనంలో కొనసాగుతున్న కొన్ని విభాగాలను మాత్రమే తరలిస్తున్నట్టు తెలిపారు. మొత్తం ఆసుపత్రి తరలిపోతుందనేది కేవలం ఆపోహేనన్నారు. రోగులు, వైద్యులకు మంచి చేయాలన్న నిర్ణయంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. తరలింపు సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక సుల్తాన్ బజార్ ఆసుపత్రి భవనం తరలింపు నిర్ణయాన్ని విరమించుకున్నట్టు చెప్పారు.