: ప్రత్యేక హోదాపై సుప్రీంకోర్టు మెట్లెక్కనున్న ఏపీ ప్రభుత్వం?
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? ప్రస్తుతం అందర్లోనూ ఇదే ప్రశ్న. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి చెబితే... ప్రత్యేక హోదా కోసం కసరత్తు చేస్తున్నామని మరో కేంద్ర మంత్రి చెప్పారు. ఈ క్రమంలో, ఈ అంశంపై ఎంతో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎడతెరిపి లేని చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఒక వార్త సంచలనం రేకెత్తించేలా ఉంది. విభజన సమయంలో పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్న క్రమంలో... దాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందనేది ఆ వార్త సారాంశం. ఇదే సమయంలో, తమ మిత్రపక్షమైన బీజేపీకి ఇబ్బంది కలుగని రీతిలో ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. ముందుగా బీజేపీ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పి, ఆ దిశగా అడుగు వేయాలని భావిస్తోంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటన చేసినందున... దాన్ని అమలు చేయాల్సిన బాద్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందనే కోణంలో సర్వోన్నత న్యాయస్థానంలో దావా వేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించినట్టు సమాచారం.