: అధిష్ఠానం చెప్పినా వరంగల్ నుంచి పోటీ చేయను: మాజీ ఎంపీ వివేక్
వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను మాత్రం ఆ స్థానానికి పోటీచేసేది లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్ చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశించినా ఉపఎన్నిక బరిలో నిలవనని స్పష్టం చేశారు. ఒకవేళ వరంగల్ సీటు ఇస్తామని ఏ పార్టీ అయినా ఆఫర్ ఇచ్చినా పార్టీ మారబోనని తేల్చి చెప్పారు. గతంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చెప్పడంవల్లే ఎన్నికలకు ముందు పార్టీలో చేరానని వెల్లడించారు. తమ కుటుంబమంతా కాంగ్రెస్ కోసమే పనిచేసిందని, తన విధేయతను హై కమాండ్ కూడా గుర్తించిందన్నారు. కానీ తానింకా రాజకీయాల్లో రాటుదేలలేదన్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వివేక్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ అణచివేయాలని చూశారన్నారు. తనపై వ్యక్తిగతంగా ఆయన కక్ష గట్టారని వ్యాఖ్యానించారు. టి.కాంగ్రెస్ నాయకత్వంపై సీమాంధ్రత నేతల ప్రభావం ఉందని అన్నారు. దళితుడు సీఎం అయితేనే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.