: జైట్లీ ఫేస్ బుక్ పోస్ట్ పై దిగ్విజయ్ ట్విట్టర్ రెస్పాన్స్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్తంభించి పోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం నాడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టింగుపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. జీఎస్ టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) ఆమోదానికి కాంగ్రెస్ సహకరించట్లేదని జైట్లీ విమర్శించగా, "2006 నుంచి 2014 వరకూ ఇదే బిల్లు ఆమోదం పొందేందుకు బీజేపీ ఎందుకు అంగీకరించలేదు? రాజకీయ అవకాశవాదమే బీజేపీ విధానం" అని వ్యాఖ్యానించారు. కాగా, పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు బీజేపీ నేతలు, సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లు తమ పదవులకు రాజీనామాలు చేసిన తరువాత మాత్రమే పార్లమెంట్ సమావేశాలకు తాము సహకరిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎవరూ రాజీనామాలు చేయబోరని వెల్లడించిన బీజేపీ, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా చూసేందుకు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని మరికాసేపట్లో జరపనుంది.