: నా కుమారుడు సెలబ్రిటీ అయినందుకే టార్గెట్ చేస్తున్నారు... ముస్లిం అయినందుకు కాదు: సల్మాన్ ఖాన్ తండ్రి
తన కుమారుడు ఒక స్టార్ హీరో, ఒక సెలబ్రిటీ అయినందుకే అతన్ని టార్గెట్ చేస్తున్నారని... ముస్లిం అయినందుకు కాదని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షేలార్ కు సల్మాన్ పై వ్యక్తిగత ద్వేషం ఉందని ఆయన ఆరోపించారు. 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాబా సిద్దిఖీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో సల్మాన్ పై ఆశిష్ కు కోపం ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆశిష్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. సల్మాన్ కు వ్యతిరేకంగా తనకు ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా వదలనని గతంలోనే తనతో ఆశిష్ అన్నారని తెలిపారు. సల్మాన్ నివాసం ఎదుట బీజేపీ శ్రేణులు చేస్తున్న నిరసన కార్యక్రమాలతో ఒరిగేది ఏమీ లేదని సలీం ఖాన్ అన్నారు. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష నేపథ్యంలో, యాకుబ్ అమాయకుడని, అతని సోదరుడు టైగర్ మెమనే అసలైన నేరస్తుడని సల్మాన్ ట్వీట్ చేయడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ తర్వాత తన తండ్రి సలహాతో తన ట్వీట్ ను సల్మాన్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ మతతత్వవాది ఎంతమాత్రం కాదని ఆయన అన్నారు. మోదీని తాను ఎన్నో సార్లు వ్యక్తిగతంగా కలిశానని... ఆయన ఏనాడూ తనకు ఒక మతతత్వవాదిలా కనిపించలేదని చెప్పారు. మోదీ ఆలోచనలు, భావజాలం చూస్తే ప్రతి ఒక్కరికీ ఒక స్పష్టమైన ఆలోచన వస్తుందని తెలిపారు. 79 ఏళ్ల వయసులో కూడా తాను ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే, తాను ఒక ఫూల్ గా మిగిలిపోతానని అన్నారు.