: పాటల రూపకల్పనలో తలమునకలైన రేవంత్
ఓటుకు నోటు కేసులో కండిషనల్ బెయిల్ మీద కొడంగల్ లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తన పూర్తి సమయాన్ని పార్టీ అభ్యున్నతి కోసమే ఉపయోగిస్తున్నారు. పాటలను రాస్తూ, రాయిస్తూ ఆయన బిజీబిజీగా ఉన్నారట. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రచయిత, సింగర్ తో కలసి పాటల ఆల్బంను రూపొందిస్తున్నారు. మొత్తం ఐదు పాటలుండే ఈ ఆల్బమ్ లో పలు అంశాలను టచ్ చేస్తున్నారు. ఈ ఆల్బమ్ లో 'తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలిరా' అనే పాట స్థాయిలోనే మరోపాటను రూపొందిస్తున్నారట. అలాగే తెలంగాణలో టీడీపీ ఎవరి కోసం? ఎందుకోసం? అనే విషయాన్ని వివరిస్తూ రెండో పాట ఉంటుంది. ఉస్మానియా యూనివర్శిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఎందుకు జరపలేదన్న కోణంలో మరో పాట రూపొందుతోంది. ఉద్యమానికి ఆయువుపట్టైన గద్దర్, కోదండరామ్, విమలక్క, గోరటి వెంకన్న తదితర ప్రముఖులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎందుకు దూరంగా ఉంటున్నారనే కోణంలో మరో పాట ఉంటుంది. 'కేసీఆర్ ఇంటికి లైట్లు, ఉస్మానియాకు మాత్రం చీకట్లు' అనే కోణంలో ఇంకో పాటను రూపొందిస్తున్నారు. తాను జైల్లో ఉన్న సమయంలో తనపై రూపొందించిన పాటకు మంచి ఆదరణ లభించడంతో... ఈ ఆల్బమ్ రూపకల్పనకు రేవంత్ నడుం బిగించారు. త్వరలోనే ఈ ఆల్బమ్ ను ఘనంగా విడుదల చేయాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారట.