: అప్పుడే నాన్న కళ్లలో తొలిసారి కన్నీళ్లు చూశా: అమితాబ్ బచ్చన్
33 ఏళ్ల క్రితం కూలీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను వెంటనే కోలుకోవాలని ఎంతో మంది ప్రార్థించారని, వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కూలీ ప్రమాద ఘటన తనకు రెండో జన్మలాంటిదని ఆయన అన్నారు. కోలుకున్న తర్వాత ఇంటికి వచ్చాక తన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ కన్నీళ్లు పెట్టుకున్నారని... తన తండ్రి కళ్లలో నీరు చూడటం తనకు అదే తొలిసారని చెప్పారు. 1982 ఆగస్టు 2న బెంగళూరులో షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. కోలుకోవడానికి ఆయనకు కొన్ని నెలల సమయం పట్టింది. ఈ క్రమంలో, ఆగస్టు 2వ తేది తనకు పునర్జన్మ వంటిదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా, తన తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఆయన ట్విట్టర్లో పెట్టారు.