: ఎంపీలకూ 'నో వర్క్ నో పే' రూల్... మోదీ సర్కారు కొత్త ఆలోచన!
పార్లమెంటు కార్యకలాపాలు నిరసనల మధ్య ఏ రోజుకారోజు ఆగిపోతున్న నేపథ్యంలో, 'నో వర్క్ నో పే' రూల్ ను తీసుకురావాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర టూరిజం శాఖ మంత్రి మహేష్ శర్మ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పని చేయకుంటే, ఎలా వేతనంలో కోత పడుతుందో అదే పద్ధతిని పార్లమెంటు సభ్యుల విషయంలోనూ వర్తింపజేయాలని, సభను అడ్డుకునే వారి జీతాల్లో కోత విధించాలని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై వారం దాటినా ఒక్క రోజు కూడా ఉభయ సభలు సరిగ్గా పనిచేయని సంగతి తెలిసిందే. వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు రాజీనామాలు చేస్తేనే సభా కార్యకలాపాలకు సహకరిస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, ఈ అంశాలపై చర్చలకు సిద్ధమని, ఎవరూ రాజీనామాలు చేసే ప్రశ్నే లేదని బీజేపీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.