: ఇండియా మరో విజయం... హెయిర్ లాస్ చికిత్సపై పేటెంట్ మనవారికే
అంతర్జాతీయ యవనికపై భారత్ మరో విజయం సాధించింది. జుట్టు రాలిపోవడమనే సమస్యకు చికిత్సగా వాడుతున్న సంప్రదాయ పద్ధతులపై పేటెంట్ సాధించింది. బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న ఓ ల్యాబొరేటరీ, పసుపు, గ్రీన్ టీ, దేవదారు చెట్టు బెరడు తదితరాలు వినియోగిస్తూ, హెయిర్ లాస్ ట్రీట్ మెంటును తాము కనిపెట్టామని, దీనికి పేటెంట్ ఇవ్వాలని కోరగా, ఇండియా దాన్ని ప్రతిఘటించి విజయం సాధించింది. ఇదే సమయంలో యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న కోల్గేట్-పామోలివ్ ప్రకృతిలో లభించే కొన్ని రకాల ఔషధాలతో మౌత్ వాష్ తయారు చేశామని, దానికి పేటెంట్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ నూ భారత్ అడ్డుకుంది. ఇవి భారత్ లో ఎంతో కాలంగా వాడుతున్నవేనని సీఐఎస్ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ఆధ్వర్యంలో నడుస్తున్న టీకేడీఎల్ (ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ) నిఘా విభాగం అధికారులు యూరప్ పేటెంట్ ఆఫీసులో దాఖలు చేసిన నివేదిక, పిటిషన్ లపై విచారణ జరిపిన అధికారులు, ఈ ఉత్పత్తులపై పేటెంట్ హక్కులు ఇండియావేనని తేల్చారు. దీంతో ఫిబ్రవరి 2011లో బ్రిటన్ సంస్థ పాంగియా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వేసిన పేటెంట్ దరఖాస్తు వీగిపోయినట్లయింది. ఇండియా చూపిన సాక్ష్యాల తరువాత ఆయుర్వేదం, యునానీ తదితరాల్లో పసుపు, దేవదారు తదితరాలను హెయిర్ లాస్ కు చికిత్సా విధానంలో వాడారు. కాబట్టి మిగతా సంస్థలు వెనక్కు తగ్గాల్సిందేనని యూరప్ పేటెంట్ ఆఫీసు తేల్చింది.