: ఐఎస్ఐఎస్ కన్నా అమెరికానే క్రూరమైనది: ఎన్నారై ప్రొఫెసర్ దీపా కుమార్ ట్వీట్ పై ఎడతెగని చర్చ
"ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం తీవ్రమైనదే. వారు చాలా మందిని చంపారు. కానీ, ఇరాక్, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ దేశాల్లో అమెరికా అంతకన్నా ఎక్కువ మందిని మట్టుబెట్టింది. ఐఎస్ఐఎస్ క్రూరమైనది. అమెరికా అంతన్నా ఎక్కువ క్రూరమైనది" అంటూ, ఇండియన్-అమెరికన్ ప్రొఫెసర్ దీపా కుమార్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టించాయి. రట్జర్స్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దీపా తన అమెరికా వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక విమర్శలు చేస్తూ, ఈ వ్యాఖ్యలను మార్చి 26న ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై అమెరికాలో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె తక్షణం దేశం విడిచిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఆమె తన భావ ప్రకటన హక్కును వినియోగించుకున్నారని మద్దతిచ్చారు. కథ అంతటితో ఆగలేదు. శుక్రవారం నాడు ఫాక్స్ న్యూస్ చానల్ ఆమె ట్వీట్ ను చూపిస్తూ, ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో దీపా మరిన్ని చిక్కుల్లో పడ్డట్లయింది. "దీపా కుమార్ వద్ద విద్యను నేర్చుకుంటున్న వారి పట్ల నాకు బాధ కలుగుతోంది. మా ప్రభుత్వం వేలాది మంది అమాయక బాలికలపై డజన్ల సార్లు అత్యాచారం చేయించలేదు. స్వలింగ సంపర్కులను భవంతుల పై నుంచి తోసి హత్య చేయలేదు. ఆమె వ్యాఖ్యలు ఘోరమైనవి" అని టెర్రరిజంపై ప్రత్యేక రీసెర్చ్ చేసి నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా ఉన్న మాక్స్ అబ్రహామ్స్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను దీపా సమర్థించుకోవడం గమనార్హం.