: కాల్ గర్ల్ తో ప్రేమలో పడ్డ టైగర్ మెమన్!
1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమన్ (ఇటీవల మరణశిక్షకు గురైన యాకూబ్ మెమన్ అన్న) ఓ కాల్ గర్ల్ ప్రేమలో పడ్డాడని, ఒక దశలో తన భార్యకు విడాకులు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాడని 'దైనిక్ భాస్కర్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముంబై పేలుళ్లకు ముందు టైగర్ మెమన్ ఎన్నో వేశ్యా గృహాలకు వెళ్లేవాడని, ఓ గృహంలో ఉన్న యువతిని ఎంతో ప్రేమించాడని తెలిపింది. ఆమె కోసం తన స్మగ్లింగ్ వ్యాపారానికి స్వస్తి చెప్పాలని కూడా భావించినట్టు పేర్కొంది. ఈ కథలో మరో ట్విస్ట్ ఏంటంటే, అదే యువతిని కిషన్ అనే మరో వ్యక్తి కూడా కోరుకున్నాడట. ఆమెకు, టైగర్ మెమన్ కు మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకుని కిషన్ తనను తాను సజీవ దహనం చేసుకోబోయాడట. కిషన్ మనసులో ఉన్న ప్రేమను తెలుసుకున్న ఆమె, అప్పటి నుంచి టైగర్ ను దూరం పెట్టిందట. కాగా, మార్చి 12న వర్లీ ప్రాంతంలో బాంబులతో నిండిన కారును పోలీసులు గుర్తించగా, అది ఈ కాల్ గర్ల్ పేరిటే రిజిస్టరై ఉంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించి టైగర్ గురించిన ఎంతో సమాచారాన్ని సేకరించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే అస్గర్ ముకదమ్, షానవాజ్ ఖురేషీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు టైగర్ దుబాయ్ పారిపోయాడన్న సంగతి తెలిసిందే.