: నేటి రాత్రి తెలుగు రాష్ట్రాలను పలకరించనున్న వరుణుడు
ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. బంగ్లాదేశ్ ను వణికిస్తున్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి నిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి అదే దిశగా వస్తోందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఒడిశా నుంచి కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, నేటి రాత్రి కోస్తా, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వానలు కురవవచ్చని తెలిపింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో మహేశ్వరంలో 6 సెంటీమీటర్లు, పుత్తూరు, ఆత్మకూరు, కూసుమంచిలో 4 సెం.మీ., నగరి, ఎర్రగొండపాలెం, మద్నూరులో 3 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈ తెల్లవారుఝామున హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.