: 'విండోస్ 10' ఉచిత అప్ డేట్ ను నమ్మొద్దు: హెచ్చరించిన సిస్కో
ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన విండోస్ 10 ఇటీవల 190 దేశాల్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు మోసగాళ్లు వైరస్ లను కంప్యూటర్లలోకి చొప్పిస్తున్నారని నెట్ వర్క్ పరికరాల తయారీ, డిజైనింగ్ సంస్థ సిస్కో హెచ్చరించింది. 'విండోస్ 10 ఫ్రీ అప్ డేట్' పేరిట వచ్చే ఈ-మెయిల్ ను నమ్మరాదని తెలిపింది. దీన్ని ఓపెన్ చేస్తే సిస్టమ్ పై ప్రమాదకర వైరస్ దాడులు జరుగుతాయని వివరించింది. ఈ-మెయిల్ 'అప్ డేట్ ఎట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్' నుంచి వస్తుందని, మైక్రోసాఫ్ట్ వాడే రంగులు, ఫాంట్లలోనే కనిపిస్తుందని, దీన్ని ఇన్ స్టాల్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ కాకపోగా, అన్ని ఫైల్స్ కూ 'మల్ వేర్ లాక్స్' పడతాయని హెచ్చరించింది. కంప్యూటర్ కు అటాచ్ చేసిన ప్రింటర్, స్కానర్ వంటివేవీ పనిచేయవని, తదుపరి 96 గంటల్లో కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సమాచారం వస్తుందని సిస్కో తెలిపింది. దీని బారిన పడకుండా ఉండాలంటే ఈ 'ఉచిత అప్ డేట్' మెయిల్ ను తెరవరాదని కోరింది.