: విద్యుత్ అప్పులపై ఏపీకి చుక్కలు చూపుతున్న తెలంగాణ!


విభజన చట్టంలోని సెక్షన్ 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలో సమస్యలు సద్దుమణగడం లేదు. మిగతా అన్ని సంస్థల విషయంలో ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం వంతున పంపకాలు జరిపిన పెద్దలు, విద్యుత్ విషయంలో మాత్రం వినియోగం ఆధారంగా కేటాయింపులు జరిపిన సంగతి తెలిసిందే. విద్యుత్ అప్పుల విషయంలో టీఎస్ సర్కారు పెడుతున్న మెలికలు ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే తాము ఎక్కువ కట్టామని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇక 'ఒక్క పైసా కూడా ఇవ్వం' అంటూ తెగేసి చెప్పింది. విద్యుత్ ను వినియోగం ఆధారంగా, అప్పులను జనాభా సంఖ్య ప్రాతిపదికన విభజించాలని తెలంగాణ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చి మెలికలు పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయగా, దీని ద్వారా బాండ్లు జారీచేసి, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయే సమయానికి మొత్తం రూ .5,894 కోట్ల మేర బాండ్లను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం తెలంగాణకు రూ.3,509 కోట్లు, ఏపీకి రూ.2,385 కోట్ల మేర అప్పులు విభజించారు. ఈ బాండ్లపై వడ్డీ చెల్లించాల్సి ఉన్నా, అప్పులను జనాభా ప్రాతిపదికనే కేటాయించాలన్న పేచీతో, వడ్డీ చెల్లింపులను ఆపివేసింది. దీంతో బ్యాంకుల నుంచి హెచ్చరికలు రావడంతో, అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికిప్పుడు దాదాపు రూ.215 కోట్ల వడ్డీ భారాన్ని ఏపీ సర్కారు మోయాల్సి వస్తోంది. దీనిపై తెలంగాణకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కేంద్రానికి, గవర్నరుకు లేఖలు రాశారు.

  • Loading...

More Telugu News