: సినిమా కాదు...నిజం...మరి, ఈ 'భజరంగీ' ఆమెను స్వదేశం చేరుస్తుందా?
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రంజాన్ కానుకగా విడుదల చేసిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా సూపర్ హిట్టైంది. అందులో వినికిడి సమస్యతో బాధపడే ఓ పాకిస్థాన్ మూగ బాలికను స్వదేశం చేర్చడానికి సల్మాన్ చేసే ప్రయత్నానికి అద్భుతమైన ఆదరణ లభించింది. భారత, పాకిస్థాన్ లోనే కాకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టింది. అచ్చం ఈ సినిమాలోని షాహీదా అలియాస్ మున్నీ పాత్ర లాంటి వ్యధే గీత అనే భారతీయ బాలికది. గీత కథను పాక్ హక్కుల కార్యకర్త అన్సర్ బర్నే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గీత అనే వినికిడి సమస్యతో బాధపడే మూగ అమ్మాయి ఎలా చేరిందో తెలియదు కానీ, 15 ఏళ్ల క్రితం పాకిస్థాన్ చేరింది. పలు అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందిన గీత చివరకు పాక్ లోని పేరొందిన స్వచ్ఛంద సంస్థ 'ఈద్ ఫౌండేషన్'కు చేరింది. పుట్టు మూగ, చెవుడు ఉన్న ఆమెకు ఇప్పుడు 22 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వుంటుంది. అయితే పొట్టిగా ఉండడంతో అంత వయసు ఉన్నట్టు కనపడదు. అయితే మాట్లాడడం రానప్పటికీ గీతకు హిందీ అర్థం చేసుకోవడం, రాయడం తెలుసు. చిన్నతనంలోనే తప్పిపోవడం వల్ల తను ఏ ప్రాంతానికి చెందినదో తెలియడం లేదు. తన కుటుంబం పెద్దదని, తనకు ఏడుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని గీత సైగల ద్వారా చెబుతోంది. ఆమె పంజాబ్ ప్రాంతానికి చెందిన యువతిగా భావిస్తున్నట్టు అన్సర్ బర్నే తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం తలపై కొంగు వేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం భారత్ లోని గీత తల్లిదండ్రులను వెతికేందుకు ప్రయత్నించానని, అయితే విఫలమయ్యానని 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసిన తరువాత గీత తల్లిదండ్రులను కలుసుకుంటాననే ఆశ చిగురించిందని అన్సర్ బర్నే తెలిపారు. సెప్టెంబర్ లో భారత్ వస్తానని చెప్పిన ఆయన ఈసారి గీత తల్లిదండ్రులను కలుసుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేశారు.