: బాబు స్వార్ధం కోసం ప్రత్యేకహోదాని ఫణంగా పెడుతున్నారు: బొత్స
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలు ప్రధానం అని గప్పాలు కొట్టే టీడీపీ నేతలు ప్రత్యేకహోదాపై నీళ్లు నములుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రత్యేకహోదా మీద ఎందుకు పోరాడడం లేదని ఆయన నిలదీశారు. అధికారంలోకి రాకముందు కేంద్రానికి భాగస్వాములం, నిధులు, ప్రత్యేకహోదా, పరిశ్రమలు తెస్తామని లేనిపోని గొప్పలు చెప్పారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు వ్యాపార ప్రయోజనాలే ప్రధానమైపోయాయని, మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు ప్రజల గురించి పట్టించుకోరని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధినేత సహా నేతలందరికీ స్వార్ధప్రయోజనాలే ముఖ్యమని, అందుకోసం ప్రత్యేకహోదాని ఫణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన తెలిపారు.