: యాకూబ్ మెమన్ భార్య నిస్సహాయురాలు... ఆమెకు రాజ్యసభ సీటివ్వండి: ములాయంకు ఎస్పీ నేత లేఖ
ముంబయి వరుస పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కడంతో, అతని భార్య రహీన్ ఇప్పుడు నిస్సహాయురాలిగా మిగిలిపోయిందని, ఆమెకు రాజ్యసభ సీటివ్వాలని సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ ఘోసీ కోరుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారు. "నేను ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాయకూడదు. ఇది సరైన సమయం కాదని కూడా తెలుసు. కానీ, పరిస్థితులు అలా ఉన్నాయి. ములాయంజీ మీరు నిస్సహాయులకు ఎల్లప్పుడు ఆసరాగా నిలుస్తారు. రహీన్ కూడా ఇప్పుడు నిస్సహాయురాలే. ఆమే కాదు, దేశంలోని ఎందరో ముస్లింలు ఇవాళ తాము నిస్సహాయులమని భావిస్తున్నారు. మనం తప్పకుండా రహీన్ కు మద్దతుగా నిలవాలి. ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా ఆపన్నుల తరపున గళమెత్తుతుంది" అని పేర్కొన్నారు. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో రహీన్ కూడా కొంతకాలం జైల్లో గడిపింది. ఆమె పాత్రపై ఆధారాల్లేకపోవడంతో కోర్టు విడుదల చేసింది.