: గిఫ్ట్ లకు కలాం దూరం... వ్యాపార సంస్థ గ్రైండర్ కు చెక్కు పంపిన మాజీ రాష్ట్రపతి


జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగిన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచారు. రాష్ట్రపతి పదవికే ఆయన వన్నె తెచ్చారు. రాష్ట్రపతి హోదాలో ఆయనకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున బహుమతులు అందాయి. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన రాష్ట్రపతి హోదాలో తనకు అందిన గిఫ్ట్ లనన్నింటినీ ఆయన రాష్ట్రపతి భవన్ లోనే వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా ఆయన నిజాయతీకి సంబంధించి మరో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన సౌభాగ్య గ్రైండర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదికేశవన్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వివరాల్లోకెళితే... 2014లో ఈరోడ్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అబ్దుల్ కలాం హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణమవుతున్న కలాంకు ఆదికేశవన్ వెట్ గ్రైండర్ ను కానుకగా ఇవ్వడానికి వచ్చారు. ''వెట్ గ్రైండర్ మా ఇంటికి అవసరం. కాని ఉచితంగా వద్దు. ధర చెల్లించి తీసుకుంటాను’’ అని కలాం బదులిచ్చారట. అయినా వినని ఆదికేశవన్ దానిని బలవంతంగా కలాంకు పంపించారు. కొద్దిరోజులకు సదరు గ్రైండర్ ధర రూ.4,850కు ఓ చెక్ ను ఆదికేశవన్ అందుకున్నారు. చెక్ పై కలాం సంతకాన్ని చూసిన ఆదికేశవన్, ఆ చెక్ ను బ్యాంకులో వేసుకోకుండా, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నారు. మరో రెండు నెలలకు ఆదికేశవన్ కు ఏకంగా కలాం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘‘గ్రైండర్ కొనుగోలు నిమిత్తం పంపిన చెక్ ను మీరు బ్యాంకులో వేయలేదు. మీరు దానిని నగదుగా మార్చుకోకుంటే, గ్రైండర్ ను వెనక్కు పంపమని సార్ చెప్పారు’’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారట. ఇక చేసేది లేక సదరు చెక్ జిరాక్స్ కాపీని భద్రంగా దాచుకున్న ఆదికేశవన్ చెక్ ను నగదుగా మార్చుకున్నారు.

  • Loading...

More Telugu News