: అర్జున అవార్డు అందుకున్న అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్జున అవార్డు అందుకున్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి అశ్విన్ ను గతేడాది ఎంపిక చేశారు. అయితే, 2014 ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి అశ్విన్ హాజరుకాలేదు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. దాంతో, ఇవాళ కేంద్ర క్రీడల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 'అర్జున' పురస్కారాన్ని అశ్విన్ కు అందించారు. ఈ సందర్భంగా అశ్విన్ స్పందిస్తూ... "నా క్రికెట్ ప్రస్థానం బాగానే సాగుతోంది. ఎన్నో విషయాల్లో నేను అదృష్టవంతుడిని. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేశానికి మెరుగైన సేవలందించడం ద్వారా మరిన్ని అవార్డులు లభిస్తాయని ఆశిస్తున్నా" అని పేర్కొన్నాడు.