: కలాం పేరిట తమిళనాడు ప్రభుత్వం అవార్డు
మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరిట ఓ అవార్డు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక ఆయన పుట్టినరోజును 'యూత్ రెనైసాన్స్ డే'గా జరపాలని నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయ అభివృద్ధి, మానవత, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేసేవారికి ఇచ్చేందుకు 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు' ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సీఎం జయలలిత వెల్లడించారు. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ అవార్డు అందజేస్తామని తెలిపారు. అవార్డు కింద 8 గ్రాముల పసిడి పతకం, రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం ఇస్తారని, ఈ ఏడాది నుంచి అవార్డు ఇవ్వనున్నామని జయ పేర్కొన్నారు. ఇక కలాం పుట్టినరోజు అక్టోబర్ 15న ప్రభుత్వం తరపున 'యూత్ రెనైసాన్స్ డే'గా పాటించనున్నామన్నారు.